భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

  • నైటీ ధరించిందని భార్యతో గొడవపడిన భర్త
  • రెండు రోజుల క్రితం భర్తను అరెస్టు చేసిన పోలీసులు
  • గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో, దుస్తుల విషయంలో వివాదం తలెత్తడంతో భర్త భార్యకు నిప్పంటించాడు. ఈ సంఘటన ఖానాపూర్ తాలుకాలోని నందగడ గ్రామంలో జరిగింది. రోజువారీ కూలీ అయిన కృష్ణాజీ పాటిల్ తన భార్య మంజులా పాటిల్ నైటీ ధరిస్తుందని తరుచూ గొడవపడేవాడు. తాను ఎంత చెప్పినా వినడం లేదనే కోపంతో ఇటీవల ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పోలీసులు భర్తను ఏప్రిల్ 20వ తేదీన అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆమెకు సుమారు 80 శాతం గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ తర్వాత బ్రిమ్స్‌కు, అక్కడి నుంచి గోవాలోని ఆసుపత్రికి తరలించారు. కృష్ణాజీ, మంజులకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. నైటీ ధరించవద్దని తరుచూ గొడవపడిన అతను, మూడు రోజుల క్రితం ఈ దారుణానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 11 గంటలకు జరిగింది. వారు నివసిస్తున్న అద్దె ఇంట్లోనే ఘటన జరిగింది. ఘటన జరిగిన రోజు కూడా ఆమె నైట్ డ్రెస్ ధరించిందని, దీనితో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అతను నిప్పంటించడంతో ఆమె అరిచిందని, దీనితో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Belagavi horror
Woman set on fire by husband for wearing nighty instead of saree

More Telugu News